అది దేశంలోని పది ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. దశాబ్దాలుగా అక్కడ చదువుకున్నలక్షలాది విద్యార్థులు దేశంలో అనేక రంగాల్లో అనేక ఉన్నత పదవులను సమర్థంగా నిర్వహించి దేశానికే వన్నె తెచ్చారు. చాలామంది విదేశాలకు వెళ్ళి తమ ప్రతిభను చాటి మన దేశం కీర్తి పతాకను ఎగురవేశారు.
ఇదంతా ఒక ఎత్తు. చదువుతోబాటు ఆ విద్యార్థులు దశాబ్దాలుగా ఒక మహోన్నత ఉద్యమాన్ని కూడా నడుపుతున్నారు. తరాలు మారుతున్నాయి. ప్రతి సంవత్సరం పాత విద్యార్థులు వెళ్ళిపోతుంటారు. కొత్త విద్యార్థులు జాయిన్ అవుతుంటారు. కాని ఉద్యమం మాత్రం ఆగదు. యూనివర్సిటీని వదలి వెళ్ళేముందు సీనియర్లు జూనియర్లకు ఉద్యమ సారథ్య బాధ్యతలను అప్పగించి వెళ్తారు. జూనియర్లు అంతే కర్తవ్యదీక్షతో దాన్ని ముందుకు తీసుకెళ్తారు.1969 కంటే ముందునుండి ఏదొ ఒక రూపంలో ఆ విద్యార్థులు నడుపుతున్న ఆ ఉద్యమం కాస్త హెచ్చుతగ్గులున్నా, గత దశాబ్దం నుండి మహోధృతంగా సాగుతోంది. అయినా చదువులో ఆ విద్యార్థుల ర్యాంకులు తగ్గవు. ఆ విశ్వవిద్యాలయం స్థాయి, ర్యాంక్ దిగజారదు. అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్సుల్లో ఇతర విశ్వవిద్యాలయ విద్యార్థుల కంటె వాళ్ళే ఎక్కువగా రాణిస్తారు. సవ్యసాచుల్లా చెలరేగే ఆ విద్యార్థులు నడిపే ఆ ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం.
వాళ్ళు ఇతర విశ్వవిద్యాలయ విద్యార్థుల్లా గతంలో ఒకసారి రాష్ట్రాన్ని విడగొట్టాలని, ఇప్పుడేమో సమైక్యంగా ఉంచాలని ఉద్యమించే అవకాశవాదులు కారు. దశాబ్దాలుగా వారి లక్ష్యం ఒక్కటే. మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలె అన్నదే వారి ఆశయం. ఆ ఆశయ సాధనకై 1969 లో నాలుగు వందల మంది పోలిసు ఫైరింగుల్లో బలి అయ్యారు. గత నాలుగేళ్ళుగా వెయ్యిమంది విద్యార్థులు స్వీయ బలిదానాలు చేశారు. లాఠీ దెబ్బలకు రక్తాలను కార్చారు. రబ్బరు తూటాలను తిన్నారు. బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి నిలిచారు. ఎన్నో రకాల కొత్త కొత్త ఉద్యమ నిరసనలను, కార్యక్రమాలను కనుగొని ఆచరించి చూపారు. అవసరమయినప్పుడు రాజకీయాలలో తలపండిన వాళ్ళనే శాసించారు. కంటికి కునుకు లేకుండా చేశారు. వారి ధీరత్వానికి త్యాగశీలతకు ప్రపంచ ప్రజలు, మేధావులు, పరిశీలకులు ఆశ్చర్యంతో జేజేలు పలుకుతున్నారు. వారి ఉద్యమ పంథాపై కొన్ని విదేశ విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి.లు చేస్తున్నారు. ఇన్నాళ్ళకు వారి ఉద్యమశ్రమ ఫలించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ వార్తే అందుకు సాక్ష్యం. జయహో ఉస్మానియా విద్యార్థి వీరులారా! జయహో! జయహో!
No comments:
Post a Comment